ముంబయిలో వేవ్స్ సమ్మిట్ 2025 ఘనంగా ప్రారంభం
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఈవెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత సినీ పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖులు హాజరయ్యారు. సాంకేతికత, వినోద రంగాల కలయికగా జరిగిన ఈ సమ్మిట్ దేశవ్యాప్తంగా విశేషంగా చర్చకు వచ్చింది.
ఈ ఈవెంట్ సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమ భవిష్యత్ ప్రాజెక్టులపై ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి మోదీ ముందుకు తీసుకెళ్తున్న విజన్‌కు అనుగుణంగా భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో లైకా తొమ్మిది కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల్ని మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.
లైకా గ్రూప్ చైర్మన్ డాక్టర్ అల్లిరాజా సుభాస్కరణ్ మాట్లాడుతూ, “భారతీయ సినిమాను ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం. మన సాంస్కృతిక విలువలు, కథన శైలిని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కొనసాగిస్తున్నాం” అని తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత సినిమా పరిశ్రమకు ఒక కొత్త దిశను అందించగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.