తెలంగాణలో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల కోసం ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలకు "దోస్త్ 2025" నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విద్యార్థులు ఒకే విండో ద్వారా సులభంగా అడ్మిషన్ పొందేందుకు ప్రతి సంవత్సరం "డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ" (దోస్త్) పేరిట ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,025 ప్రభుత్వ, ప్రైవేట్ మరియు సహాయ డిగ్రీ కళాశాలల్లో ఉన్న 4,57,000 సీట్ల భర్తీ కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నారు.
విద్యార్థులు BA, B.Sc, B.Com, BBA, BCA, BBM వంటి కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ ప్రవేశ ప్రక్రియను మూడు దశలుగా నిర్వహించనున్నారు. ఫేజ్-1 లో మే 3 నుంచి మే 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 10 నుంచి మే 22 వరకు వెబ్ ఆప్షన్ లభిస్తుంది. సీట్ల కేటాయింపు మే 29న జరగనుంది. ఫేజ్-2 లో మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వెబ్ ఆప్షన్ మే 30 నుంచి జూన్ 9 వరకు, సీట్ల కేటాయింపు జూన్ 13న ఉంటుంది. ఫేజ్-3 లో జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తులు, అదే తేదీలలో వెబ్ ఆప్షన్, జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.
మూడు దశల్లో సీట్లు కేటాయించుకున్న విద్యార్థులు జూన్ 24 నుంచి జూన్ 28 మధ్య కాలేజీల్లో చేరవచ్చు. డిగ్రీ క్లాసులు జూన్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. దోస్త్ వెబ్‌సైట్‌లో (https://dost.cgg.gov.in) విద్యార్థులు తమ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. సందేహాల నివృత్తికి వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ సౌకర్యం కూడా కల్పించబడింది.