చెన్నై, సెప్టెంబర్ 13: సినీ నటుడు-రాజకీయ నాయకుడిగా మారిన విజయ్, తన పార్టీ తమిళగ విజయ్ కజగం (TVK) తొలి ఎన్నికల ప్రచారాన్ని త్రిచీ నుంచి ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఇది 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక ఘట్టంగా భావిస్తున్నారు.
ప్రచారం అరియలూర్ పబ్లిక్ మీటింగ్ తో ప్రారంభం కానుంది. విజయ్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ ఎన్నికల టూర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రచార బస్సు వాడనున్నారు. ఇందులో హైటెక్ కెమెరాలు, లౌడ్‌స్పీకర్లు, రక్షణ కోసం ఐరన్ రైలింగులు అమర్చబడ్డాయి. ఈ బస్సు పనయూర్ నుంచి గురువారం రాత్రి బయలుదేరగా, విజయ్ స్వయంగా ఈరోజు విమానంలో త్రిచీ చేరుకుంటారు.
ప్రచారానికి ఊపు ఇవ్వడానికి పార్టీ ప్రచార లోగోను విడుదల చేసింది. ఇందులో “మీ విజయ్.. నేను విఫలం కాను”, “తమిళనాడు, విజయ్ లెగసీ రిటర్న్స్” అనే స్లోగన్లు ఉన్నాయి.
పోలీసుల కఠిన షరతులు
ఈ సభకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ, 25 కఠిన షరతులు విధించారు. వీటిలో రోడ్‌షోలు, భారీ వాహన కాన్వాయ్‌లపై నిషేధం ఉంది. విజయ్ బస్సును ఐదు వాహనాలకంటే ఎక్కువ ఫాలో కావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భద్రతా దృష్ట్యా బారికేడ్లు పార్టీ ఖర్చుతోనే ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సభను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.
త్రిచీ ప్రాధాన్యం
రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, విజయ్ త్రిచీని ఎంచుకోవడం వెనుక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
- మాజీ సీఎం ఎంజీఆర్ ఇక్కడే AIADMK రెండో మహాసభ నిర్వహించారు. అదే సమయంలో ప్రసిద్ధ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. త్రిచీని తమిళనాడు రెండో రాజధానిగా ప్రకటించారు.
- డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై కూడా త్రిచీలోనే పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
విజయ్ ఎంట్రీతో కొత్త హీట్
ప్రస్తుతం విజయ్ సభ వేదికగా ఎంచుకున్న మరక్కడై ప్రాంతం గతంలో అనేక ప్రధాన పార్టీల సభలకు వేదికైంది. ఇటీవలే AIADMK నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కూడా ఇక్కడే ప్రచారం నిర్వహించారు. దీన్ని బట్టి త్రిచీ ఇంకా రాజకీయ పోరాటానికి కేంద్ర బిందువుగానే కొనసాగుతుందని స్పష్టమవుతుంది.
విజయ్ ఈ రంగంలో అడుగుపెట్టడం తో, ఆయన అభిమానులు ఈ ప్రచార ప్రారంభాన్ని తమిళనాడు రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్గా చూస్తున్నారు. అయితే ఇది నిజంగా 2026 ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి.