తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లను, శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జులై-ఆగస్ట్ నెలల్లో అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. వాతావరణ శాఖ(IMD) నుండి వర్షాల సమాచారం తీసుకొని, గ్రామాల్లోని ప్రజలకు, రైతులకు కనీసం 3 గంటల ముందు సమాచారం ఇవ్వాలని చెప్పారు. జూన్ నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 21% తక్కువ వర్షాలు నమోదయ్యాయి కానీ, ఈరోజుల వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆయన అన్నారు.
ఉరుములు, మెరుపుల కారణంగా ప్రాణనష్టాలు జరగకుండా చూడాలని, జరుగితే సంబంధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించేందుకు వివరాలు సేకరించాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, డాక్టర్ల నియామకాలు, దవాఖానల తనిఖీలు వంటి అంశాలపై కూడా సమీక్ష జరిపారు.
ప్రతి జిల్లా కలెక్టర్‌కు ₹1 కోటి అత్యవసర నిధి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు ఫీల్డ్‌లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని, బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.