ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా ధ్వంసాత్మక దాడి
ఉపగ్రహ చిత్రాల ద్వారా ఇరాన్ భారీ నష్టాలు వెలుగులోకి
అమెరికా దాడికి ముందే కీలక పరికరాలు, శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ తరలించిందనే అనుమానాలు
అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడులతో ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ అణుకేంద్రం పరిసరాలు తీవ్రంగా నష్టం చెందినట్లు తెలుస్తోంది. పేలుళ్ల కారణంగా పర్వత భాగం రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడిలో ఫోర్డో అణుకేంద్రం ముఖ ద్వారాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, ఈ దాడికి ముందే ఇరాన్ కీలక పరికరాలు మరియు శుద్ధి చేసిన యురేనియంను భద్రపరిచినట్లు సూచనలు ఉన్నాయి.
పర్వతం కింద వంద మీటర్ల లోతులో ఉన్న ఈ అణుకేంద్రంపై అమెరికా 14 బంకర్ బస్టర్ బాంబు దాడులు జరిపింది. దాడుల కారణంగా ఆ ప్రాంతంలో భారీ బిలలు ఏర్పడినట్లు తెలుస్తోంది. దాడికి ముందే అణుకేంద్రం ప్రవేశద్వారం మూసివేసినట్లు సమాచారం. దాడుల తర్వాత పర్వత భాగాల రంగు, ఆకృతులు కూడా మునుపటి చిత్రాల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి.
పేలుళ్ల ధాటికి శిధిలాలు ఎగిరి పర్వతభాగాలు రంగు మారినట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ దాడి కోసం అమెరికా బంకర్ బస్టర్ బాంబు ఉపయోగించినట్లు ఇదే సాక్ష్యం అని భావిస్తున్నారు. ఘటన స్థలంలో భారీ పొగ వ్యాప్తి చెందింది.
ఇరాన్‌లోని ఫోర్డోతో పాటు నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై కూడా అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ‘మిడ్ నైట్ హామర్’ అనే సైనిక ఆపరేషన్ ద్వారా ఇరాన్ అణు స్తావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఈ దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం జరిగింది. అమెరికా ఈ ఆపరేషన్‌ను పూర్తి విజయంగా పేర్కొంది. ఇరాన్ రక్షణ వ్యవస్థ ఈ స్టెల్త్ విమానాలను గుర్తించలేకపోయింది. అయితే అణు కేంద్రాలకు జరిగిన నష్టాన్ని ఇరాన్ ఇంకా అంచనా వేయాల్సి ఉంది.