ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (WIS) మరియు ఇంటెల్ ల్యాబ్స్ కు చెందిన పరిశోధకులు, వేర్వేరు ఏఐ మోడళ్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకునేలా, కలసికట్టుగా పని చేసేలా ఒక కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలో ఉన్న ప్రత్యేక అల్గారిథమ్‌లు వలన ఏఐలు ఒకే టీమ్ లాగా పని చేయగలుగుతాయి. ఫలితంగా వేగం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి.
ఈ కొత్త విధానం ద్వారా, చాట్‌జీపీటీ, జెమినీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల వేగం సగటున 1.5 రెట్లు, కొన్నిచోట్ల 2.8 రెట్లు పెరిగిందని పరిశోధకులు తెలిపారు. దీని వలన స్మార్ట్‌ఫోన్లు, డ్రోన్లు, డ్రైవర్‌లెస్ కార్లు వంటి యంత్రాల్లో ఏఐ స్పందన వేగంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రైవర్‌లెస్ వాహనాల్లో వేగంగా నిర్ణయం తీసుకోవడం భద్రతకు ఎంతో కీలకం.
ఇప్పటివరకు, వేర్వేరు సంస్థలు రూపొందించిన ఏఐ మోడళ్ల మధ్య భిన్నమైన టోకెన్ల భాషలు ఉండటం వలన అవి కలిసి పని చేయలేవు. ఇది భిన్న దేశాలవారూ ఓ భాష తెలియక మాట్లాడేందుకు ప్రయత్నించడం లాంటిదే అని పరిశోధకులు తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు వారు రెండు ప్రత్యేక అల్గారిథమ్‌లు రూపొందించారు. ఒకటి డేటాను ఉమ్మడి ఫార్మాట్‌గా మార్చుతుంది, మరొకటి అన్ని మోడళ్లకు సరిపోయే టోకెన్లను వాడేలా చేస్తుంది. ఈ టూల్స్‌ను ఇప్పటికే ఓపెన్-సోర్స్ లో విడుదల చేశారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లకు ఉపయోగపడుతోంది.