Andhra Pradesh

విజయవాడ రైల్వే స్టేషన్‌లో భద్రత కఠినం – అప్రమత్తత కోసం మాక్ డ్రిల్ నిర్వహణ

విజయవాడ రైల్వే స్టేషన్ భద్రతా కవాతు:
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి ప్రత్యేక మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ జేవీ రమణ మరియు ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి పర్యవేక్షణలో ఈ డ్రిల్ జరిగింది. రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన ఐదు ప్రత్యేక బృందాలు రైల్వే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫాంలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టికెట్ కౌంటర్లు, బుకింగ్ కార్యాలయాలు, పార్శిల్ విభాగం వంటి ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అలాగే, స్టేషన్ వెలుపల రద్దీగా ఉండే పూల మార్కెట్, డీజిల్ లోకో షెడ్ వంటి ప్రాంతాల్లోనూ సిబ్బంది బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను నమోదు చేసుకున్నారు. స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాల పనితీరును అధికారులు సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ఫుటేజీని నిశితంగా పరిశీలించాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మాక్‌డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు, ప్రయాణికులకు భద్రతపై భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens