అమరావతి, మే 4: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఆధ్వర్యంలో మే 7న ఏపీ ఐసెట్ (AP ICET) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఎం. శశి తెలిపారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు రెండో సెషన్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,572 మంది విద్యార్థులు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకుని హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇంతకముందుగా మే 3తో ముగిసిన తెలంగాణ ఐసెట్ (TS ICET) దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఆ పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి మే 4న ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు మే 10వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.