రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గత ఏడాది నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద 11,558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2024 వరకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. తక్కువ ఉద్యోగాలు మాత్రమే ఉండగా దేశం నలుమూలల నుండి సుమారు 1.21 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం విశేషం. ఇది దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత స్థాయికి స్పష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల ఆర్‌ఆర్‌బీ దరఖాస్తుల గణాంకాలతో పాటు పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది.
తాజా సమాచారం ప్రకారం, CBT-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్ష జూన్ 2025లో నిర్వహించనున్నారు. పరీక్షకు పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్లు, నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ పద్ధతిలో ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. షిఫ్ట్ 1 ఉదయం 9:00 నుండి 10:30 వరకు (రిపోర్టింగ్ సమయం 7:30 AM), షిఫ్ట్ 2 మధ్యాహ్నం 12:45 నుండి 2:15 వరకు (రిపోర్టింగ్ సమయం 11:15 AM), షిఫ్ట్ 3 సాయంత్రం 4:30 నుండి 6:00 వరకు (రిపోర్టింగ్ సమయం 3:00 PM) జరుగుతాయి.
CBT-1 పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానానికి మూడవ వంతు మార్కు తగ్గింపు ఉంటుంది. మొత్తం ఖాళీలలో 8,113 గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలు, 3,445 అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి.
CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులు CBT-2, అనంతరం స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరుకాగలరు. ఈ ప్రక్రియల ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి అధికారిక RRB వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.