దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌తో సహా పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయిలో నీట్ 2025 పరీక్ష ఆదివారం (మే 4) ప్రశాంతంగా ముగిసింది. ఈసారి 22.7 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 20.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 5,400కు పైగా పరీక్ష కేంద్రాల్లో ఉదయం 2 గంటల నుండి 5:20 గంటల మధ్య నిర్వహించబడింది. ఎలాంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత మధ్య ఈ పరీక్షను నిర్వహించారు.
విదేశాల్లో కూడా 14 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన ఈ పరీక్షలో కొంతమంది విద్యార్థులకు బయోమెట్రిక్ నమోదు విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వారు ఎన్‌టీఏకు ఫిర్యాదు చేసారు. అధికారుల ప్రకారం, విద్యార్థులు 11 గంటల నుండి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడేలా ఉన్నప్పటికీ, కొందరు మధ్యాహ్నం 1:30 గంటల వరకు చేరుకున్నారు. గతేడాది పేపర్ లీకేజీల వల్ల పెద్ద ఆందోళనలు వచ్చాయి, కానీ ఈ సారి ఎలాంటి పేపర్ లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రాలు అత్యంత భద్రతతో కేంద్రాలకు చేరవేసారు.
ఈసారి NEET 2025 పరీక్ష పేపర్ చాలా కఠినంగా ఉంది, ముఖ్యంగా ఫిజిక్స్ విభాగం, జేఈఈ మైన్‌స్ స్థాయిని దాటింది. పూర్వ విద్యా కోచింగ్ కేంద్రాలు లేదా మాక్ టెస్ట్‌లలో కూడా ఈ తరహా ప్రశ్నలు ఇవ్వడం లేదని నిపుణులు పేర్కొన్నారు. ఫిజిక్స్ ప్రశ్నలు కేవలం థియరీ ఆధారంగా కాకుండా, సుదీర్ఘమైన సమస్యలను పరిష్కరించడం అవసరం, ఈ సమస్యలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. కెమిస్ట్రీలో కూడా NCERT స్థాయిని దాటిన ప్రశ్నలు ఉండగా, బయాలజీలో NCERT పరిధిలోనే ప్రశ్నలు వచ్చాయి. ఈ సంవత్సరం పరీక్ష కఠినంగా ఉండటంతో, కటాఫ్‌లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 720 మార్కులకు 720 స్కోరు చేయడం కష్టం అని వారు చెప్పున్నారు. ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదల కానున్నాయి.