ప్రతి సంవత్సరం, కోట్లాది పర్యాటకులు యూరప్‌లో ప్రయాణిస్తారు. వారిలో చాలా మంది ప్రవేశానికి షెంగెన్ వీసాలు తీసుకోవాలి. అయితే ఇటీవలి కాలంలో వీసా తిరస్కరణలు పెరిగి, ప్రయాణికులకు భారీ ఆర్థిక నష్టాలు ఏర్పడ్డాయి. ఇందులో చాలా మంది భారతీయులు ఉన్నారు.
తాజా గణాంకాల ప్రకారం, భారత్ షెంగెన్ వీసా తిరస్కరణల విషయంగా మూడో స్థానంలో ఉంది. గత సంవత్సరం భారతీయులు సుమారు 1.108 మిలియన్ వీసాల కోసం దరఖాస్తు చేశారు. వీటిలో 1,65,000 వీసాలు తిరస్కరించబడ్డాయి. దీనివల్ల భారతీయ దరఖాస్తుదారులకు సుమారు ₹136 కోట్లు ఆర్థిక నష్టం అయ్యిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.
కండే నాస్ట్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 1.7 మిలియన్ షెంగెన్ వీసా దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. వీసా ఫీజు గత ఏడాది జూన్‌లో €80 నుంచి €90కి పెరిగింది. సగటున ఒక్కో దరఖాస్తుకు €85 తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వీసా తిరస్కరణలతో ₹1,410 కోట్లు సంపాదించారన్న అంచనా ఉంది. ఈ గణాంకాలు భారతీయ ప్రయాణికులకు ఉన్న కష్టాలను చెబుతున్నాయి.