గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పెద్ది’ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ కోసం నగర శివార్లలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే భారీ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారు.
ఈ సినిమా కథకు తగినట్లుగా, సహజతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ గ్రామీణ సెట్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సారధ్యంలో ఈ సెట్‌ను అద్భుతంగా రూపొందించారు. ఈ సెట్‌లో ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాలు, కీలక టాకీ పార్టులు షూట్ చేస్తున్నారు. ఇప్పటివరకు షూటింగ్ 30 శాతం పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ తాజా షెడ్యూల్‌తో కీలకమైన భాగం పూర్తవుతుందని భావిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పొడవాటి జుట్టు, గడ్డం, ముక్కుపుడకతో గ్రామీణ యువకుడి లుక్‌లో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్, కీలక పాత్రల్లో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ నటిస్తున్నారు. కెమెరామెన్‌గా ఆర్. రత్నవేలు, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, ఎడిటర్‌గా నవీన్ నూలి పనిచేస్తున్నారు. ఈ సినిమాను 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.