డిసెంబర్ వరకు ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ జైలర్ 2 షూటింగ్ వేగంగా జరుగుతోందని, ఈ ఏడాది డిసెంబర్ వరకు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలిపారు. గురువారం చెన్నై విమానాశ్రయం నుండి బయలుదేరేటప్పుడు ఆయన మాట్లాడుతూ, “షూటింగ్ బాగానే జరుగుతోంది. సినిమా డిసెంబర్‌లో పూర్తి అవుతుంది” అని చెప్పారు.
నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జైలర్ 2 కి భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో సీక్వెల్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ చిత్రం మార్చి 10న చెన్నైలో షూటింగ్ ప్రారంభమైంది. అనంతరం కేరళ అట్టపాడిలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రజినీకాంత్ భార్య విజి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మొదటి భాగంలో రజినీకాంత్ కోడలిగా కనిపించిన మిర్నా మీనన్ సీక్వెల్‌లో మరింత కీలక పాత్ర పోషించనుంది. మొదటి సినిమా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా ఈ చిత్రంలో ఉన్నారని వార్తలు వస్తున్నా, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.